హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1948 సెప్టెంబరు 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక సందర్భమని పేర్కొన్నారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణతో పాటు మరాఠ్వాడా, హైదరాబాద్- కర్నాటక ప్రాంతాలు ఉండేవని గుర్తుచేశారు. విమోచన ఉద్యమంలో ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలను కృతజ్ఞతతో స్మరించుకోవాలని, విమోచన యోధులకు నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.
ఈ చారిత్రక ఘట్టం, నాటి ప్రజల త్యాగాల గురించి భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ‘‘విమోచన యోధుల ధైర్యం, త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యత, సమగ్రత విలువలను పరిరక్షిస్తూ ముందుకు సాగాలి’’ అని గవర్నర్ పేర్కొన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఐక్యతా భావంతో నిర్వహించి, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెప్పిన గవర్నర్
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జన్మదినం జరుపుకుంటుండటంతో తెలంగాణ ప్రజల తరఫున, తన తరఫున గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు చెప్పారు. ప్రధానిపై లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. 25 ఏండ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకున్న ప్రధానికి గవర్నర్ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
